ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు 2,000కు పైగా విషపూరిత పాములను సురక్షితంగా పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టిన మహిళ ఇప్పుడు అదే సేవ చేస్తూ ప్రాణాపాయ స్థితికి చేరింది. పాములపై ఆమెకున్న ప్రేమ, ధైర్యసాహసాల కారణంగా స్థానికులు ఆమెను **’స్నేక్ ఫ్రెండ్’**గా పిలుస్తుంటారు. అయితే, తాజాగా ఓ నాగుపామును రక్షించే ప్రయత్నంలో జరిగిన ప్రమాదం ఆమెను ఆస్పత్రి పాలిచేసింది.
ఈ ఘటన బీహార్లోని పశ్చిమ చంపారణ జిల్లాలో చోటుచేసుకుంది. విషహ గ్రామానికి చెందిన మున్నీలాల్ ఇంట్లోకి ఒక విషపూరిత నాగుపాము ప్రవేశించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. దాన్ని పట్టుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సర్పాలను రక్షించడంలో అనుభవం ఉన్న జానకీ దేవికి సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న జానకీ దేవి, ఇంటి మూలన దాక్కున్న నాగుపామును అత్యంత చాకచక్యంగా పట్టుకుని సంచిలో బంధించింది. అనంతరం దాన్ని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టడంతో గ్రామస్థులు ఆమెను అభినందించారు.
అయితే, అదే ప్రాంతంలో మరో నాగుపాము కనిపించినట్లు సమాచారం రావడంతో జానకీ దేవి దానిని కూడా రక్షించేందుకు ప్రయత్నించింది. ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పామును పట్టుకునే క్రమంలో అది ఒక్కసారిగా మెరుపువేగంతో ఆమెపై దాడి చేసి కాటు వేసింది.
విషం వేగంగా శరీరంలోకి వ్యాపించడంతో జానకీ దేవి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్థులు వెంటనే ఆమెను సమీప ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం నేపాల్లోని ఒక ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఇప్పటివరకు వేలాది పాములను రక్షించి ప్రకృతి సంరక్షణకు సేవలందించిన జానకీ దేవి త్వరగా కోలుకోవాలని స్థానికులు, ప్రకృతి ప్రేమికులు ప్రార్థిస్తున్నారు. ఆమె మళ్లీ ఆరోగ్యంగా తిరిగి వచ్చి తన సేవలను కొనసాగించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.