నేటి కాలంలో గ్రామాల నుంచి నగరాల వరకు మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులు సర్వసాధారణంగా మారాయి. అయితే తెలంగాణలోని ఓ చిన్న గ్రామం మాత్రం ఈ ధోరణికి పూర్తి భిన్నంగా నిలుస్తోంది. దాదాపు శతాబ్ద కాలంగా మద్యానికి దూరంగా ఉంటూ, సామాజిక ఐక్యత, కుటుంబ విలువలు, ప్రశాంత జీవనానికి ఆదర్శంగా నిలిచింది.
సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మర బండపాలెం గ్రామంలో గత 100 సంవత్సరాలుగా మద్యం అమ్మకాలకు అనుమతి లేదు. గ్రామంలో సుమారు 91 కుటుంబాలు నివసిస్తుండగా, అందులో ఎక్కువగా ముస్లిం, ముదిరాజ్ కుటుంబాలు ఉన్నాయి. వ్యవసాయం, కూలీ పనులు, వెల్డింగ్, చిన్న వ్యాపారాలే గ్రామస్థుల ప్రధాన జీవనాధారం.
ఈ గ్రామంలో కులాలు, మతాలు వేరైనా గ్రామ ప్రయోజనాల విషయంలో అందరూ ఒకే మాటపై నిలబడటం ప్రత్యేకత. గ్రామంలో మద్యం విక్రయాలు మాత్రమే కాకుండా, మద్యపానాన్ని కూడా ప్రోత్సహించరు. ఎవరైనా మద్యం సేవించాలనుకుంటే గ్రామ సరిహద్దులు దాటి వెళ్లాల్సిందే.
ఈ ప్రత్యేక సంప్రదాయానికి పునాది వేసింది గ్రామ పెద్దలే. దాదాపు వందేళ్ల క్రితం మద్యం కుటుంబాల ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుందని, సామాజిక సమస్యలకు కారణమవుతుందని భావించి గ్రామంలో స్వచ్ఛంద మద్యనిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఆ నియమాన్ని ప్రతి తరం గౌరవిస్తూ కొనసాగిస్తోంది.
కాలక్రమంలో గ్రామంలో మద్యం షాపులు ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ, గ్రామ ప్రజలంతా ఐక్యంగా వాటిని అడ్డుకున్నారు. గ్రామ ప్రశాంతతకు భంగం కలిగించే ఏ చర్యనైనా అనుమతించకూడదనే సంకల్పంతో వారు ఇప్పటికీ అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు.
గ్రామస్థుల అభిప్రాయం ప్రకారం, మద్యం లేకపోవడంతో కుటుంబాల ఆదాయం అనవసరంగా ఖర్చు కాకుండా పిల్లల చదువు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతోంది. అంతేకాకుండా కుటుంబ కలహాలు, గొడవలు, నేరాలు కూడా చాలా తక్కువగా ఉండటంతో గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొంది.
ఈ విలువలను కేవలం పెద్దలు మాత్రమే కాకుండా యువత కూడా బాధ్యతగా ముందుకు తీసుకెళ్తోంది. మద్యపానం వల్ల కలిగే దుష్పరిణామాలపై కొత్త తరానికి అవగాహన కల్పిస్తూ, గ్రామ సంప్రదాయాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించేందుకు కృషి చేస్తున్నారు.
శతాబ్దకాలంగా మద్యానికి దూరంగా ఉండి సామాజిక ఐక్యత, కుటుంబ సంక్షేమం, ప్రశాంత జీవనానికి మారుపేరుగా నిలిచిన తమ్మర బండపాలెం గ్రామం తెలంగాణకే కాదు, దేశవ్యాప్తంగా ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందుతోంది.