వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుభవార్త తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని, దీంతో నైరుతి రుతుపవనాలు మళ్లీ బలపడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
ఐఎండీ అంచనా ప్రకారం ఈ నెల 23 లేదా 24 తేదీల్లో ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ప్రస్తుతం బలహీనంగా ఉన్న రుతుపవనాలు తిరిగి చురుకుగా మారనున్నాయి.
మొదట ఈశాన్య భారతదేశంలో రుతుపవనాలు పుంజుకుని, అనంతరం వచ్చే వారం ప్రారంభంలో తూర్పు, మధ్య, ఉత్తర భారత ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
అల్పపీడనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.
ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రజలు, రైతులు తాజా వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.