భక్తులు తమ కోరికలు నెరవేరినప్పుడు దేవుళ్లకు మొక్కులు చెల్లించుకోవడం సాధారణమే. తమ ఆర్థిక స్థోమతను బట్టి బంగారు కిరీటాలు, వెండి పాదుకలు, హారాలు, ఆభరణాలు వంటి కానుకలను సమర్పిస్తుంటారు. అయితే రాజస్థాన్లోని ఓ ఆలయంలో భక్తులు సమర్పిస్తున్న కానుకలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఓ భక్తుడు ఏకంగా బంగారంతో తయారు చేసిన మనిషి గుండె ఆకారాన్ని దేవుడికి సమర్పించడం విశేషంగా మారింది.
రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ జిల్లాలో ఉన్న ప్రఖ్యాత సన్వారియా సేఠ్ ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ భక్తుడు కొంతకాలం క్రితం తీవ్రమైన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. వైద్యులు శస్త్రచికిత్స తప్పనిసరిగా చేయాలని సూచించారు. దీంతో ఆ భక్తుడు సన్వారియా సేఠ్ను దర్శించుకుని తనకు ఆరోగ్యం ప్రసాదిస్తే బంగారు గుండెను కానుకగా సమర్పిస్తానని మొక్కుకున్నాడు.
ALSO READ: యువకుల్లో అంగస్తంభన సమస్య.. గుండె జబ్బులకు ముందస్తు హెచ్చరిక
ఆ తర్వాత అతనికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించగా ఆపరేషన్ విజయవంతమైంది. దీంతో తన ప్రాణాలను కాపాడిన దేవుడికి మొక్కు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. సుమారు 21 గ్రాముల స్వచ్ఛమైన బంగారంతో మనిషి గుండె ఆకారంలో ప్రత్యేకంగా ఒక కానుకను తయారు చేయించి ఆలయానికి సమర్పించాడు. ఈ అరుదైన కానుక ఇప్పుడు భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.
ఈ ఆలయంలో ఇలాంటి ప్రత్యేకమైన కానుకలు సమర్పించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కొందరు భక్తులు పోలీసుల బేడీల నమూనాలో వెండి కానుకలు, వెండి గుండె, పెట్రోల్ బంకు నమూనా వంటి వస్తువులను కూడా దేవుడికి సమర్పించినట్లు తెలుస్తోంది. జైలు నుంచి బయటపడితే వెండి బేడీలు సమర్పిస్తామని, వ్యాపారంలో విజయం సాధిస్తే పెట్రోల్ బంకు నమూనాను కానుకగా ఇస్తామని కొందరు మొక్కుకున్నట్లు సమాచారం.
ALSO READ: దీపావళి కానుకగా ఉద్యోగులకు రూ.లక్ష బోనస్.. నోట్ల కట్టలు పంచిన వస్త్ర వ్యాపారి!
సాధారణంగా దేవుడికి బంగారు ఆభరణాలు సమర్పించడం చూస్తుంటాం. కానీ తమ జీవితంలో ఎదురైన ప్రత్యేక పరిస్థితులు, నెరవేరిన కోరికలకు గుర్తుగా ఇలాంటి విభిన్నమైన కానుకలు సమర్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భక్తుల నమ్మకానికి, మొక్కుల వైవిధ్యానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
