తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి పావలా శ్యామల ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమవారం అర్ధరాత్రి అనంతరం ఆమెకు తీవ్ర గుండెపోటు రావడంతో మరణించినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.
1951లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జన్మించిన పావలా శ్యామల అసలు పేరు నేతి శ్యామల. చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆమె నాటక రంగం ద్వారా కళారంగంలోకి అడుగుపెట్టారు. అనంతరం సినీ పరిశ్రమలో ప్రవేశించి తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
1985లో విడుదలైన ‘బాబాయ్ అబ్బాయ్’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన పావలా శ్యామల, దర్శకుడు కె. విశ్వనాథ్ తెరకెక్కించిన ‘స్వర్ణకమలం’ చిత్రంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. అనంతరం ‘ఖడ్గం’, ‘ఆంధ్రావాలా’, ‘గోలీమార్’ సహా అనేక చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.
పావలా శ్యామల మరణ వార్తతో సినీ వర్గాల్లో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆమె సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు.
100 ఏళ్లుగా మద్యానికి నో చెప్పిన తెలంగాణ గ్రామం.. ప్రశాంత జీవనానికి నిలువెత్తు నిదర్శనం.