పుష్ప -2 రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.అయితే టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆయన నివాసం వద్దకు చేరకుని పోలీస్ స్టేషన్‌కు రావాలని అడిగారు. హీరో అల్లుఅర్జున్ వారికి సహకరించి వారితో పాటు గా వెళ్లారు.
అల్లు అర్జున్ వెంట ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా వెళ్లాలని చూడగా పోలీసులు వద్దని సూచించారు. అల్లుఅర్జున్ ఆందోళనలో ఉన్న తన భార్య స్నేహారెడ్డికి అర్జున్ ధైర్యం చెప్పి పోలీస్ లతో వెళ్లిపోయారు. పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీ తేజ (13)తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి సిపిఆర్ చేసి దుర్గాభాయి దేశ్ ముఖ్ ఆస్పత్రికి తరలించారు.
థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ రాక గురించి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఘటనలో ఇప్పటికే థియేటర్ యజమాని, మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రోజు రాత్రి తొక్కిసలాట జరిగిన కేసులో ఇప్పటికే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌పై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
బిఎన్ఎస్ సెక్షన్లు 105, 118(1) రెడ్ విత్ 3(1) ప్రకారం కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోడానికి కారణమైనందుకు అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న అల్లు అర్జున్ను వైద్య పరీక్షల కోసం తరలించారు. ఈ ఘటన పై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నాం అని డిసిపి తెలిపారు.