తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. ఆగస్టు 15 నుంచి పంపిణీ | Telangana Smart Ration Cards

తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. ఆగస్టు 15 నుంచి పంపిణీ | Telangana Smart Ration Cards

తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల వ్యవస్థలో పారదర్శకతను మరింత పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 15న 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ఆగస్టు 15న ప్రారంభం

సంగారెడ్డి జిల్లాలో ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు.

1.05 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచడంతో పాటు, లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.

ALSO READ: జుట్టు ఆరోగ్యానికి మునగ గింజల నూనె ఉపయోగకరమా? పరిశోధనలు ఏమి చెబుతున్నాయి?

సురక్షితమైన, మన్నికైన స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. లబ్ధిదారుల వివరాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఈ కార్డులు ఉపయోగపడనున్నాయి.

కలెక్టర్లకు కీలక బాధ్యతలు

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించిన ప్రణాళిక, సమన్వయం, అమలు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. పంపిణీ ప్రారంభానికి ముందే జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాలను పూర్తిస్థాయిలో పరిశీలించి ఖరారు చేయాలని ఆదేశించింది.

అదేవిధంగా ఇప్పటికే సిద్ధంగా ఉన్న లామినేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డులను సురక్షితంగా భద్రపరచడంతో పాటు, వాటిని పంపిణీ కేంద్రాలకు సమయానికి చేరేలా రవాణా ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించింది.

ALSO READ: విజయవాడ అమ్మవారి ఆలయానికి వెళ్లేవారికి అలర్ట్.. సెల్‌ఫోన్లపై కీలక నిర్ణయం | Vijayawada

ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రేషన్ కార్డుల పంపిణీ సమయంలో లబ్ధిదారులకు ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కార్డు పంపిణీకి సంబంధించిన ఫిర్యాదులు, సమస్యలను ఈ వ్యవస్థ ద్వారా పరిష్కరించనున్నారు.

నోడల్ అధికారుల నియామకం

జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమంగా పరిగణించి సమర్థవంతంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సర్క్యులర్ జారీ చేశారు.

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *