విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు కీలక సూచనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో సెల్ఫోన్ల వినియోగంపై మరింత కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈఓ) శ్రీను నాయక్ వెల్లడించారు. భక్తులతో పాటు ఆలయ సిబ్బంది, అర్చకులు, అంతరాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు కూడా ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
మూడు దశల్లో కట్టుదిట్టమైన తనిఖీలు
ఆలయంలోకి ప్రవేశించే ప్రతి భక్తికి మూడు స్థాయిల్లో తనిఖీలు నిర్వహించనున్నారు. ఘాట్ రోడ్, లిఫ్ట్ మార్గం, మహామంటపం మెట్ల మార్గం సహా ఏ దారి నుంచి వచ్చినా చివరకు స్కానింగ్ పాయింట్ వద్ద తప్పనిసరిగా తనిఖీ ఉంటుంది. గోశాల, చిన్న రాజగోపురం ప్రాంతాల్లో కూడా అదనపు చెకింగ్ నిర్వహించి సెల్ఫోన్లు ఆలయంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటారు.
Also Read: ప్రయాణాల తర్వాత చర్మంపై డెడ్ స్కిన్ ఎక్కువగా కనిపిస్తుందా? ఇంట్లోనే ప్రయత్నించగల సులభమైన సహజ స్క్రబ్
సిబ్బందికీ అదే నిబంధనలు
గత నెల రోజులుగా ఆలయ సిబ్బంది, అర్చకులు, వైదిక కమిటీ సభ్యుల నుంచే “నో బ్యాగ్ – నో ఫోన్” విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు. అంతరాలయం, మొదటి ప్రాకారం, రెండో ప్రాకారం ప్రాంతాల్లో ఎవరూ మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనలు సిబ్బంది, పోలీసులు, ప్రోటోకాల్ ద్వారా వచ్చే అధికారులకూ వర్తిస్తాయని స్పష్టం చేశారు.
టికెట్ల స్కానింగ్‌కు కొత్త విధానం
టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రవేశ ద్వారాల వద్ద ప్రత్యేక స్కానింగ్, పంచింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి క్యూ లైన్ వద్ద భద్రతా సిబ్బందిని నియమించడంతో పాటు సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. భక్తుల రద్దీని బట్టి అవసరమైతే ప్రత్యేక దర్శన టికెట్లను తాత్కాలికంగా నిలిపివేసి, సాధారణ దర్శనాన్ని మాత్రమే అనుమతించే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు.
పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు
Also Read: హైదరాబాద్‌లో టీజీఎస్ఆర్టీసీ కొత్త సేవలు.. ఇక ఒకే టికెట్‌తో బస్సు…ఎలక్ట్రిక్ ఆటో ప్రయాణం.
కొంతమంది నిబంధనలు ఉల్లంఘించి ఆలయంలోకి సెల్ఫోన్లు తీసుకెళ్లడం, మూలవిరాట్టు చిత్రాలు, వీడియోలు తీసిన ఘటనలు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈఓ వెల్లడించారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఎలాంటి మినహాయింపులు ఉండవని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మొబైల్ రహిత ఆలయంగా మారనున్న దేవస్థానం
రాబోయే రోజుల్లో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం మొత్తం మొబైల్ రహిత ప్రాంతంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఈఓ శ్రీను నాయక్ తెలిపారు. భక్తులందరికీ ప్రశాంతమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారి దర్శనం కల్పించడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.