ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ, ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనంలో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారడంతో, ఉపాధ్యాయులే సొంత ఖర్చుతో తాత్కాలిక షెడ్ నిర్మించి బోధన కొనసాగిస్తున్నారు.
శిథిలావస్థలో పాఠశాల భవనం
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని గోపాలపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. భవనం స్లాబ్‌లు పెచ్చులూడి ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉండటంతో అందులో తరగతులు నిర్వహించడం అసాధ్యంగా మారింది. అయినప్పటికీ కొత్త భవనం నిర్మించడం గానీ, తాత్కాలిక తరగతి గదులు ఏర్పాటు చేయడం గానీ ఇప్పటివరకు జరగలేదు.
గ్యాస్, ఎసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా? ఇంట్లోనే సహజ యాంటాసిడ్ తయారు చేసుకునే సులభమైన మార్గం.
16 మంది విద్యార్థులు.. ఇద్దరు ఉపాధ్యాయులు
ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 16 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. పిల్లల చదువుకు అంతరాయం కలగకుండా ఉండేందుకు తొలుత గ్రామంలోని ఓ ఇంటిని నెలకు రూ.1,500 అద్దెకు తీసుకుని తరగతులు నిర్వహించారు. అయితే అద్దె భారం పెరగడంతో అంగన్‌వాడీ కేంద్రం పక్కన సుమారు రూ.40 వేల సొంత డబ్బుతో రేకుల షెడ్ నిర్మించి అక్కడే బోధిస్తున్నారు.
వర్షం వస్తే సెలవే
షెడ్ చిన్నదిగా ఉండటంతో విద్యార్థులు ఇరుకుగా కూర్చోవాల్సి వస్తోంది. వర్షం కురిసినప్పుడు నీరు షెడ్‌లోకి చేరి పుస్తకాలు తడుస్తుండటంతో తరగతులు నిర్వహించడం కష్టంగా మారుతోంది. భారీ వర్షాలు పడితే పాఠశాలకు సెలవు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
పాములు, తేళ్లు, మరుగుదొడ్ల సమస్య
పాఠశాల చుట్టూ గడ్డి, పొదలు అధికంగా పెరగడంతో పాములు, తేళ్లు సంచరిస్తున్నాయని విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లు సరిగా లేకపోవడం, తాగునీటి సౌకర్యం పరిమితంగా ఉండటం, క్రీడా మైదానం లేకపోవడం వంటి సమస్యలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి.
గ్యాస్, ఎసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా? ఇంట్లోనే సహజ యాంటాసిడ్ తయారు చేసుకునే సులభమైన మార్గం.
విద్యార్థుల ఆవేదన
“మా పాఠశాల భవనం చాలా ప్రమాదకరంగా ఉంది. స్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. వర్షం వస్తే షెడ్‌లోకి నీరు చేరి పుస్తకాలు తడుస్తాయి. మాకు కొత్త పాఠశాల భవనం నిర్మించాలి” అని విద్యార్థులు కోరుతున్నారు.
అధికారుల స్పందనపై అసంతృప్తి
పాఠశాలకు వచ్చే కాంపోజిట్ గ్రాంట్‌ను తాగునీరు, స్టేషనరీ వంటి ప్రాథమిక అవసరాలకే వినియోగిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొత్త భవనం నిర్మించాలని విద్యాశాఖ అధికారులను పలుమార్లు కోరినా, అది తమ పరిధిలో లేదని, ఇతర శాఖలను సంప్రదించాలని సూచించినట్లు వారు తెలిపారు.
వెయిట్ లాస్ కోసం సాలడ్స్ మాత్రమే తింటున్నారా? ఇలా చేస్తే ప్రయోజనం.. ఇలా చేస్తే ప్రమాదం!
గ్రామస్థుల విజ్ఞప్తి
సుమారు రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ పాఠశాల ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఉపాధ్యాయులు తమ సొంత డబ్బుతో విద్యార్థులకు ఆశ్రయం కల్పించడం అభినందనీయమైన విషయమే అయినప్పటికీ, ఇది శాశ్వత పరిష్కారం కాదని గ్రామస్థులు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త పాఠశాల భవనం మంజూరు చేసి, విద్యార్థులకు సురక్షితమైన వాతావరణంలో విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, గోపాలపురం వంటి గ్రామీణ ప్రాంత పాఠశాలల సమస్యలను కూడా అత్యవసరంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణలో ‘సర్’ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..