దీపావళి పండుగ సందర్భంగా సాధారణంగా ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు స్వీట్లు, బహుమతులు అందిస్తుంటాయి. మరికొన్ని సంస్థలు బోనస్ రూపంలో కొంత నగదును ఇస్తుంటాయి. అయితే గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వస్త్ర వ్యాపారి మాత్రం తన ఉద్యోగులకు ఊహించని కానుక అందించి అందరి దృష్టిని ఆకర్షించారు.
రాజస్థాన్‌కు చెందిన రామ్ స్వరూప్ అనే వ్యాపారి సూరత్‌లో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు ఏకంగా లక్ష రూపాయల చొప్పున బోనస్ అందించారు. అది కూడా సాధారణంగా కాకుండా రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్ల కట్టలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఉద్యోగులకు అందజేశారు.
ALSO READ: లంచం అడగని ఆఫీసర్.. లంచం కేసులో సస్పెండ్.
తమ యజమాని నుంచి ఇంత పెద్ద మొత్తంలో బహుమతి అందుకోవడంతో ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కొందరు సంతోషంతో ఆయనకు నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నగదు పంపిణీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ సందర్భంగా రామ్ స్వరూప్ మాట్లాడుతూ.. తన దగ్గర కోట్ల రూపాయల సంపద ఏమీ లేదని, వ్యాపారం ద్వారా వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని తనతో పనిచేసే ఉద్యోగులకు పంచుతున్నానని తెలిపారు. తాను ఒక్కడినే పండుగను సంతోషంగా జరుపుకుంటే సరిపోదని, తనతో పాటు పనిచేసే వారందరి కుటుంబాల్లోనూ ఆనందం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ALSO READ: యువకుల్లో అంగస్తంభన సమస్య.. గుండె జబ్బులకు ముందస్తు హెచ్చరిక
తన వద్ద పనిచేసే ఉద్యోగులు కూడా తన కుటుంబ సభ్యుల్లాంటి వారని ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. ఈ మంచి మనసున్న వ్యాపారిని చూసిన నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వ్యాపారంలో లాభాలు సంపాదించడమే కాదు.. ఆ లాభాల్లో తమతో పనిచేసే వారికి కూడా భాగస్వామ్యం కల్పించడం గొప్ప విషయమని అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి దీపావళి సందర్భంగా లక్ష రూపాయల బోనస్ అందించి తన ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన రామ్ స్వరూప్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
