వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు నేతలు పార్టీ మారేందుకు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీకి గుడ్ బై చెప్పి చెప్పి అధికార పక్షంలో చేరాలని ప్రయత్నాలు చేస్తుంటే తాజాగా వైసిపి ఎమ్మెల్సీ పోతుల సునీత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న సునీత.. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాజీనామా లేఖను జగన్‌కు పంపినట్లు తెలుస్తోంది. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.పోతుల సునీత 2014లో టీడీపీ నుంచి చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
కానీ అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ఆమెకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవినిచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో ఆమె వైసీపీలో చేరారు. దీంతో జగన్‌మోహన్ రెడ్డి కూడా పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో కోల్పోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.