తెలంగాణ ప్రభుత్వం ఒంటరి మహిళలకు (సింగిల్ ఉమెన్) కొత్త పెన్షన్లను అందించేందుకు సిద్ధమైంది. స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. అర్హులైన మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలనలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు.
అర్హుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించాలని సూచించారు. అలాగే, ఇప్పటికే మరణించిన పెన్షన్ లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించి, అర్హులైన కొత్త లబ్ధిదారులను చేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ బాధ్యతను ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆమె కోరారు.
ఫ్యాటీ లివర్ నుంచి రక్షణలో కాఫీ పాత్ర.. పరిశోధనలు ఏమి చెబుతున్నాయి?
ములుగు నియోజకవర్గ పరిధిలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాలకు చెందిన సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, హౌసింగ్, ఆరోగ్యం తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన మంత్రి, గ్రామాల అభివృద్ధికి అన్ని శాఖలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు.
ఇది తొలి దశ సమావేశమని, రానున్న ఒకటి నుంచి రెండు నెలల్లో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించి గ్రామాల్లో ఉన్న సమస్యలు, నిధుల కొరత, అభివృద్ధి పనుల పురోగతి వంటి అంశాలపై చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతామని చెప్పారు.
రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు, స్థానిక సంస్థల నాయకులు, జిల్లా అధికారులు అందరూ కలిసి ములుగు జిల్లా అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి గ్రామాన్ని సమానంగా అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రేమ వివాహం విషాదాంతం.. నాలుగు నెలలకే వివాహిత ఆత్మహత్య, సూసైడ్ నోట్లో సంచలన ఆరోపణలు.
ఆగస్టు 15 నాటికి అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు అందించే ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు. అర్హత ఉన్న ప్రతి మహిళకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అదే విధంగా ఆగస్టు 20 నుంచి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో “స్వచ్ఛధనం–పచ్చధనం”, “నీటికుంట–ఊటికుంట–పంటకుంట” వంటి కార్యక్రమాలతో పాటు ఉపాధి హామీ పథకం కింద చేపట్టే అభివృద్ధి పనులను వేగవంతం చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఉపాధి అవకాశాలను పెంచడం, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

మలబద్ధకం చిన్న సమస్య కాదు.. గట్ హెల్త్ బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం
