
Viral Video: ప్రాణాల్ని రిస్క్‌లో పెట్టి చిన్నారుల కోసం వాగు దాటిన హెల్త్ వర్కర్.. నెట్టింట ప్రశంసల వెల్లువ:
హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఓ ఆరోగ్య కార్యకర్త చేసిన పనిని చూసి దేశమంతా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. వరుణుడు కుండపోతగా కురిపిస్తున్న వర్షాల కారణంగా రోడ్లు, వాగులు వరద నీటితో నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడుతుంటే.. కమలాదేవి అనే హెల్త్ సెంటర్ వర్కర్ తన బాధ్యత కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టింది.
హురాంగ్ గ్రామానికి వెళ్లే రహదారులు వరదలతో దెబ్బతిన్నాయి. ప్రవహిస్తున్న వాగులు, పెద్ద పెద్ద బండరాళ్లు ఆమె మార్గంలో అడ్డుగా నిలిచాయి. అయినప్పటికీ గ్రామంలో ఉన్న చిన్నారులకు టీకాలు వేయడం కోసం కమలాదేవి ధైర్యంగా ముందుకు సాగింది. ప్రవహిస్తున్న నీళ్ల మధ్య బండరాళ్ల మీద దూకుతూ, ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ ఆ గ్రామానికి చేరుకుంది.
అక్కడికి చేరుకున్న వెంటనే పిల్లలకు సీజనల్ వ్యాధులు, ఇతర రోగాల బారిన పడకుండా టీకాలు వేసింది. తన విధి పట్ల ఉన్న నిబద్ధతను చాటుకుంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఆమె ధైర్యసాహసాలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. “ఇదే నిజమైన సేవ భావన” అంటూ చాలా మంది కొనియాడుతున్నారు. కమలాదేవి చేసిన ఈ అద్భుత సాహసం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.